కాచిగూడలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ..!
యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన నేపాలీ పనివారు భారీ చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ. 3 కోట్ల నగదుతో ఉడాయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగాఉంచుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వారం క్రితం నేపాల్‌కు చెందిన భార్యాభర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు, కోడలు విదేశీయాత్రకు వెళ్లారు. పారిశ్రామికవేత్త, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఆదివారం రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతులు మత్తులోకి వెళ్ల గానే.. ఇంట్లోని స్వర్ణాభరణాలు, నగదుతో ఉడాయించారు. నిత్యం మార్నింగ్ వాక్‌కు వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో.. సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపుతట్టారు. అప్పటికీ మగతలోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు. ఆ తర్వాత దొంగతనం విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.