బిల్ గేట్స్ తో విడాకులపై మెలిందా కామెంట్స్..
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తో విడాకులపై మెలిందా గేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బిల్ గేట్స్ తో బ్రేకప్ అవడం చాలా అవసరం అని అన్నారు. రీసెంట్ గా సాగిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అత్యంత సన్నిహిత సంబంధంలో మీ విలువలను నిలబెట్టుకోలేకపోతే విడాకులు అవసరమే అంటూ కామెంట్ చేశారు. వివాహ బంధాన్ని ముగించడం చాలా చాలా కష్టం. విడిపోవాల్సిన అవసరం అప్పుడు ఏర్పడింది. జీవితంలో అది అత్యంత బాధాకరమైన విషయం. ఆ సమయంలో ఎంతో భయాందోళనకు గురయ్యాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మెలిందా గేట్స్ తెలిపారు. కాగా ప్రజంట్ సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే గతంలో కూడా విడాకుల టాపిక్ పై మెలిందా స్పందించిన విషయం తెలిసిందే. విడాకులకు ముందే ఆయనతో చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్లు తెలిపారు. విడాకులను తన జీవితంలో చోటుచేసుకున్న బాధాకరమైన విషయంగా తెలిపారు. అయితే, ఆ తర్వాత మాత్రం తన జీవితం అద్భుతంగా సాగుతోందని చెప్పారు. చిన్న చిన్న పనులను సైతం తానే స్వయంగా చేసుకుంటున్నానని తెలిపారు. 1994లో బిల్‌గేట్స్, మెలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వివిధ కారణాల వల్ల దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో వీరు విడాకులు తీసుకున్నారు.