ఢిల్లీలో మూడు రోజులు ఉంటే..? : నితిన్ గడ్కరీ
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత గురించి దేశవ్యాప్తంగా ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మూడు రోజులు ఉంటే చాలా మీకు వ్యాధులు రావడం ఖాయం అని అన్నారు. కాలుష్య తీవ్రత విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్ జోన్ లో ఉన్నాయని అన్నారు. అయితే ఢిల్లీలో పరిస్థితి మాత్రం మరీ తీవ్రంగా ఉందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయుష్షు 10 ఏళ్లు తగ్గిపోతుందనడంలో సందేహం లేదన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేయాలని అన్నారు. ఇక రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం కోసం చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పర్యావరణాన్ని కూడా రక్షిస్తామని నితిన్ గడ్కరీ అన్నారు.
ఇకపై పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి కారణాలు కాబట్టి వాహనాల్లోనూ ఉపయోగించే ఇంధనంలో మార్పులు చేయాలని అన్నారు. మనం దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నామని, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే.. మన ఖర్చులు 16 శాతంగా ఉన్నాయని, 2026 చివరి నాటికి వాటిని సింగిల్ డిజిట్‌కు తగ్గించడానికి ప్రయత్నిస్తామని నితీన్ గడ్కరీ పేర్కొన్నారు.