పసిబిడ్డల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్..
అప్పుడే పుట్టిన పిసిబిడ్డల్ని అపహరించి, అమ్ముతున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేస్ లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల నుండి నాలుగు రోజులు వయస్సున్న ఇద్దరు చిన్నారుల్ని రక్షించినట్లుగా పేర్కొన్నారు. కాగా పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్, రాజస్థాన్ తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ ను లక్ష్యంగా ఉంచి ఈ ముఠా ఈ పనులు చేస్తుంది. ఇప్పుటి వరకు దాదాపు ఈ ముఠా 35 మంది చిన్నారులను అమ్మివేసింది. కాగా ద్వారకా జిల్లాలోని ఉత్తమ్ నగర్ లో కొందరు వ్యక్తులు ఓ శిశువును విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా ఈ ముఠా అపహరించిన శిశువులను ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో ఉంచి.. పిల్లలు లేని ధనవంతులకు వారిని రూ.5 నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారు. వారి నుంచి ఇద్దరు నవజాత శిశువులను కాపాడామని, చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా నిందితులు వారి విక్రయానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మురికివాడల్లోనే కాకుండా దేశ రాజధానిలోని ధనవంతుల నివాస ప్రాంతాల్లో కూడా ఈ ముఠాకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌లో కొందరు వైద్యుల సహకారం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.