తెలంగాణకు కాబోయే డీజీపీ ఎవరు..?
- డీజీపీ రేసులో ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లు
- ముందు వరుసలో సీవీ ఆనంద్
- ఆర్టీసీ నుంచి తనను బదిలీ చేయాలంటున్న సజ్జనార్
- సిటీ సీపీగా సజ్జనార్ ఛాన్స్ దక్కే అవకాశం
- సెప్టెంబర్‌తో ముగియనున్న ప్రస్తుత డీజీపీ పదవీ కాలం
- యుపీఎస్సీ సిఫారసు చేసే ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..
తెలంగాణ పోలీస్ బడే బాస్ ఎవరు..? సిటీ సిపీ ఆయననేనా..? రేసులో ఎవరెవరు ఉన్నారు..? సీఎం సాబ్ ఎవరిని ఇష్టపడుతున్నారు. యుపీఎస్సీ ఎవరిని ఎంపిక చేస్తుంది..? ఎవరెవరి పేర్లు అక్కడికి వెళ్లాయి..? ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్.. డీజీపీ ఆఫీస్‌లో అంతటా ఇదే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న జితేందర్ పదవీ కాలం ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో.. డిపార్టుమెంట్ ఇదే చర్చ జరుగుతోంది. ఎవరికి వారు వారి ఊహాగానాలతో పేర్లు ఖరారు చేసుకుంటున్నారు. తమ సార్ వస్తే తనకు ప్రమోషన్ గ్యారెంటీ అని ఒకరు అంటుంటే.. మరొకరు తనకు బదీలీ ఖాయం అని చెప్పుకొస్తున్నారు. దీంతో అటు పోలీసు శాఖలో.. ఇటు రాజకీయంగా పోలీస్ బడే బాస్, చోటే బాస్ ఎవరూ అంటూ డిస్కషన్ మొదలైంది.
ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఏడుగురి పేర్లను పరిశీలిస్తోంది. వారిలో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, షికాగోయల్ ముందు వరుసలో ఉన్నారు. ఈ పేర్ల నుంచి ముగ్గురిని యుపీఎస్సీ ఎంపిక చేయనుండగా, అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.
అయితే డీజీపీ రేసులో ఉన్న ఏడుగురిలో ముందు వరుసలో మాత్రం ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ పేరు వినపడుతోంది. ఏసీబీ డీజీగా ఉన్న ఆయనను హైదరాబాద్ కమిషనర్‌గా నియమించడానికి కారణం కూడా ఇదేనని సమాచారం. గతంలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన బల్వీర్‌సింగ్, పేర్వారం రాములు, అనురాగ్ శర్వ, మహేందర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సిటీ కమీషనర్ తరువాత ప్రభుత్వ సిఫారసుతో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన వారే ఉన్నారు. సో కచ్చితంగా ఈ సారి పోలీస్ శాఖ బడే బాస్‌గా సీవీ ఆనందే పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. ఇక ఆయన డీజీపీగా బాధ్యతలు తీసుకుంటే.. సిటీ కమిషనర్‌గా సజ్జనార్ వచ్చే అకాశాలు ఉన్నాయి. దిశ ఎన్కౌంటర్ తరువాత మూడున్నర సంవత్సరాలుగా సజ్జనార్ ఆర్టీసీ ఎండీ హోదాలో ఉన్నారు. అయితే తనకు ఆ పదవిపై బోర్ కొట్టినట్లు.. తనను అక్కడి నుంచి మరో పోస్టుకు.. అంటే ఇంకో డిపార్టుమెంట్‌కు బదిలీ చేయాలని ఆయన చాలా రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో సీవీ ఆనంద్ సిటీ కమిషనర్ పోస్టు సజ్జనార్‌కే దక్కుతుందని హైదరాబాద్ కమిషనరేట్‌లో టాక్.
ఇక రవిగుప్తా విషయానికి వస్తే.. ఆయన గతంలో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని స్థానికుడైన సీవీ ఆనంద్‌కే పదవి కట్టబెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్యామిశ్రా, షికా గోయల్‌కు కూడా కీలక పోస్టులు అందజేయనున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈసారి డీజీపీ పోస్టుకు మాత్రం గట్టి రేసే ఉండేలా ఉంది. కొత్తగా బాస్‌గా ఎవరు వచ్చినా వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు పోస్టులు, ట్రాన్స్ఫ్లు, ప్రమోషన్లు తప్పవని ఎవరి ఊహాగానాలు వారివి. అయితే ఈసారి డీజీపీగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందో.. ప్రభుత్వం ఎవరికి ఓటు వేస్తుందో అన్నది వేచి చూడాల్సిందే.