పోలవరం బాధితుల పేర్లు తొలగింపు పై విచారణ: సీఎం చంద్రబాబు హామీ
పోలవరం/ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జాబితా నుండి బాధితుల పేర్లు తొలగించారనే ఆరోపణలపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. గురువారం పోలవరం పర్యటనలో భాగంగా, చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం, ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా, చంద్రబాబు మాట్లాడుతూ, గిరిజనులు, రైతులు ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసి భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రారంభంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్నా, నేడు ప్రజా సంక్షేమం దృష్టిలో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
జగన్ ప్రభుత్వంపై పోలవరం నిర్మాణం ఆలస్యానికి, ఖర్చుల పెరిగిపోయిన విషయంపై చంద్రబాబు విమర్శలు చేసారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ 2019 లో 10 లక్షల పరిహారం ఇచ్చేందుకు హామీ ఇచ్చినా, ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2027 నాటికి పునరావాసం పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు. దళారులు లేకుండా ప్యాకేజీ డబ్బులు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని చంద్రబాబు తెలిపారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడిగా, నిర్వాసితుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.