ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలు చేసే పాత నేరస్తుడి అరెస్ట్.. సొత్తు స్వాధీనం
మేడ్చల్ జిల్లా: బాచుపల్లి పోలీసులు ఓ పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి, అతడి నుండి 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాలానగర్ డీసీపీ కె. సురేష్ కుమార్ బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఈ నెల 22వ తేదీన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పాత నేరస్తుడు మహమ్మద్ నాసర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడి రెండవ భార్య, చోరీకి గురైన ఇంటి యజమానురాలు స్నేహితురాలై, ఇద్దరూ కలిసి చోరీకి పన్నాగం పన్నారని తెలిసింది.
ఈ నెల 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాసర్ ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువాలో దాచిన 25 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి గొలుసులను ఎత్తుకొని, తన రెండవ భార్య శోభా రాణికి ఇచ్చాడు.
26వ తేదీన ఆ ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకుని, చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నాసర్ గతంలో ఆరు కేసులలో జైలుకు వెళ్ళాడు. అతనిపై పిడి యాక్ట్ కూడా విధించామని, జైలు నుండి విడుదల అయ్యి తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ చోరీకి పాల్పడటం అంగీకరించినట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు.
నిందితుడు నాసర్ మరియు అతడి రెండవ భార్య శోభా రాణి ని రిమాండుకు తరలించినట్లు డీసీపీ చెప్పారు.
కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు డీసీపీ రివార్డులు అందజేశారు.