కృష్ణా జిల్లా అవనిగడ్డలో ‘ఐసిస్ డ్రగ్’
ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బొకోహరమ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ‘‘ఐసిస్ డ్రగ్’’గా పేరొందిన ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ (మాదకద్రవ్యం) కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపులో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు.
రెండేళ్లలో 55,961 ట్రెమడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్ల విక్రయం
ఉగ్రవాదులు వాడే మత్తుపదార్థాలివి
అనుమతి లేకుండా ఓ దుకాణంలో విక్రయం
విజిలెన్స్, ఈగల్, ఔషధ నియంత్రణ విభాగాల తనిఖీల్లో వెలుగులోకి
అవనిగడ్డలో ‘ఐసిస్ డ్రగ్’
స్వాధీనం చేసుకున్న మందులు చూపుతున్న ఈగల్ ఐజీ రవికృష్ణ తదితరులు
ఈనాడు, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బొకోహరమ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ‘‘ఐసిస్ డ్రగ్’’గా పేరొందిన ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ (మాదకద్రవ్యం) కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపులో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. ఒకటో, రెండో కాదు.. 2022-2023, 2023-2024 సంవత్సరాల్లో ఈ ఒక్క షాపులోనే 55,961 ట్రెమడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్లు విక్రయించారు. మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా డీజీపీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఔషధ దుకాణాలు, ఏజెన్సీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్‌లో ఈ మాదకద్రవ్యాల రాకెట్ బయటపడింది. అలసట, నిద్ర రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘‘ ఐసిస్ డ్రగ్’’గా ‘‘ఫైటర్ డ్రగ్’’గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రెమడాల్ ఔషధం తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు పెట్టింది. ట్రెమడాల్‌ను ఎన్‌డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ (మాదకద్రవ్యం)గా గుర్తించింది. దీన్ని అనుమతించిన పరిమాణం, కాంబినేషన్లలో మాత్రమే తయారు చేసి వైద్యుల సూచనలతో విక్రయించాలి.
అనుమతి లేకుండానే..
అవనిగడ్డలోని మెడికల్ షాపులో మాత్రం.. యథేచ్ఛగా ఎలాంటి అనుమతులూ లేకుండానే భారీగా అమ్మేశారు. వైకాపా హయాంలో ఇది ఉద్ధృతంగా సాగింది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈగల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో ఈ గుట్టు బయటకు రావటంతో తనిఖీ అధికారులూ ఆశ్చర్యపోయారు. రికార్డుల్లో ఉన్నదానికి మించి మాత్రలు విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. భార్గవ మెడికల్ స్టోర్స్ యజమాని కొనకళ్ల రామ్మోహన్‌ను ప్రశ్నించగా.. చాలా కాలంగా ఈ మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు.
అవనిగడ్డ పరిసర ప్రాంతంలో అనేక వందల మందిని ఆయన ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మార్చినట్లు ఈగల్ విభాగం గుర్తించింది. వారంతా రోజూ దీన్ని కొంటున్నట్లు తేల్చింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా కొనకళ్ల రామ్మోహన్‌పై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ల కింద అవనిగడ్డ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ మూలాలు వెలికితీసేందుకు మరింత లోతైన దర్యాప్తు చేయనున్నట్లు ఈగల్ అధిపతి రవికృష్ణ తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం పరిధిలో ఉన్న మరికొన్ని మాత్రల్ని ఈ మెడికల్ షాపులో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.
కాలం చెల్లిన మందుల విక్రయం...
ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఔషధ దుకాణాల్లో 100 బృందాలు శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి. విశాఖపట్నంలోని కొన్ని ఔషధ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించాయి. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం-1940లోని నిబంధనలను మొత్తం 120 దుకాణాలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు. 5 దుకాణాల నుంచి మందులను సీజ్ చేశారు.