కొంపముంచిన బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌..!

By Ravi
On
కొంపముంచిన బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌..!

- బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌పై సిటీ పోలీసుల ఫోకస్‌
- వందల సంఖ్యలో లిస్ట్‌లో ఉన్న ప్రమోటర్స్‌
- టాలీవుడ్‌ సెలబ్రిటీలకు కూడా నోటీసులు
- విచారణకు రాకపోతే సీన్‌ సితారే అంటూ హెచ్చరికలు
- మెట్రో ఎండీపై కూడా కేసు నమోదు చేసే ఛాన్స్‌


గేమ్ స్టార్ట్ అయ్యింది.. పోలీసుల బెట్టింగ్ మొదలైంది.. పదులు.. వందల సంఖ్యలో చిట్టా చేరింది.. ఒక్కొక్కరిగా ఊచలు లెక్కించేలా ప్లాన్ సిద్ధమైంది. హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పోలీసులు రెడీ అయ్యారు. చోటా టూ బడా ఇలా ట్యాగ్స్ చేసి మరీ లాటరీలు తీశారు. లక్కీ డ్రాలో మొత్తం 36 మంది పేర్లు వచ్చాయి. దీంతో బంపర్ ఆఫర్ కింద స్టేషన్‌కి రావాలని తాఖీదులు ఇస్తున్నారు పోలీసులు.
నాలుగు రోజులుగా హైదరాబాద్‌ సిటీలో మొదలై స్టేట్ మొత్తాన్ని బెట్టింగ్‌ యాప్స్‌ మాఫియా షేక్‌ చేస్తోంది. ఇక ఈ యాప్స్ ప్రమోటర్స్ 11 మంది యూట్యూబర్స్‌ని గుర్తించి నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీనిపై ఒక్కొక్కరు వచ్చి పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. తప్పయింది మహా ప్రభు అంటూ కాళ్లపై పడుతున్నారు. మరికొందరు ఎక్స్‌ వేదికగా సజ్జనార్ సర్ మమ్మల్ని క్షమించండి అంటూ ప్రాదేయపడుతున్నారు. అయినా సిటీ పోలీసులు మాత్రం వదిలేది లేదంటున్నారు.. 
తాజాగా వీటిపై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు.. సిటీ కాప్స్ యూట్యూబర్స్‌ని వెంటాడితే.. వీరు ఏకంగా పాపులర్ సెలబ్రిటీలకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, యాంకర్ శ్యామల ఇలా 25 మంది సినీ పాపులర్స్ ఎవరెవరు బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేశారో వారి లిస్ట్ తీసి ఎఫ్ఐఆర్‌లో పేర్లు పెట్టి కేసులు బుక్ చేశారు. నోటీసులు అందిన వెంటనే విచారణకు రాకపోతే జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించిన సెలబ్రిటీలు ఎఫ్‌ఐఆర్‌ అనే సరికి కంగుతిన్నారు. మరికొంతమంది ఎప్పుడైనా మనం ప్రమోట్ చేశామా..? చేస్తే ఆ వీడియో ఉందో లేదో చెక్‌ చేసుకుని.. ఉంటే డిలీట్ చేయించే పనిలో పడ్డారు. 
ఇప్పటికే వందల సంఖ్యలో పోలీసులు పేర్లు సేకరించారు. కొందరు సినీ దిగ్గజాలు పోలీసులకు ఫోన్ చేస్తే సినిమా అబీ బాకీ హై బ్రో అంటూ సమాధానం చెబుతున్నారట. ఏదిఏమైనా మూడు కమిషనరేట్ల పోలీసులు పోటీ పడి మరీ బెట్టింగ్ బాల్ రాజులు, రాణీల పేర్లు సేకరించడం బ్లాక్ బ్లస్టర్ సినిమాలను తలపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంది.. సినిమా వారే కాదు మెట్రో ఎండీ సైతం ఈ కేసులో వుండబోతున్నారట. మెట్రోలో బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్ చేసినందుకు ఆయనపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. అయితే ఇవన్నీ కేవలం విచారణలోనే అంటే సంగంలోనే ఆగిపోతాయా..? లేక సినిమా మొత్తం చూపిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:

Advertisement

Latest News