వచ్చే ఎన్నికల దాకా సీఎం రేవంతే..!
- కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.
- ఈ టర్మ్ మొత్తం సీఎం రేవంత్‌రెడ్డే..!.
- రేవంత్ నిర్ణయాలపై సీనియర్ల అసంతృప్తి.
- రేవంత్ సన్నిహితులకు మంత్రి పదవులు.
- మీనాక్షీ నటరాజన్‌కి విభేదాల పరిష్కార బాధ్యత.
- రేవంత్‌ను తొలగిస్తే రాజకీయ సంక్షోభం..?.
- వచ్చే ఎన్నికల దాకా రేవంత్‌నే కొనసాగించాలని నిర్ణయం.
తెలంగాణలో సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తన పదవీకాలన్ని పూర్తిచేస్తారని స్పష్టం చేసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఆయనకు ఓ సూచన కూడా చేసినట్లు తెలుస్తోంది.. పార్టీలోని అంతర్గత విభేదాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకుసాగాలని సలహా కూడా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా సీఎం రేంవత్ స్థానంలో మరో వ్యక్తి బాధ్యతలు చేపడతారని పుకార్లు షికారు చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై కాంగ్రెస్ సీనియర్‌నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇంకా కీలక మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నాయి తప్ప.. ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. మరోవైపు ఈ కీలక మంత్రి పదవులను తన సన్నిహితులకు కట్టబెట్టడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ గమనించిన కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి తెలంగాణ ఇన్‌చార్జ్‌గా మీనాక్షీ నటరాజన్‌ని పంపింది.
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు కామనే. ఐతే.. కొత్త ఇన్‌చార్జ్ వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు బీఆర్‌ఎస్ సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటు బీజేపీ కూడా విమర్శనాత్మకంగా రేవంత్‌ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ప్రారంభంలో దూకుడుగా ఉన్న రేవంత్.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో రేవంత్ సైలెంట్ అయిపోయారు.
ఇకపోతే.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు.. కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో మాదిరిగా రొటేషనల్ పద్ధతిలో సీఎం పదవిని భర్తీ చేయాలని భావించింది. అయితే.. మూడు రాష్ట్రాల్లోనూ సీఎంలు బలంగా ఉండడంతో.. ఈ వ్యూహం ఆచరణ సాధ్యం కాదని తెలుసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ప్రారంభంలో.. సీఎం పదవిని మరో నేతతో మధ్యలో భర్తీ చేయాలని ప్రణాళిక వేసింది. కానీ.. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు మరియు రాజకీయ అస్థిరతతో హస్తం హైకమాండ్ పునరాలోచనలో పడిపోయింది. మరోవైపు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ప్రస్తుతం ఆధిపత్య పోరాటం జరుగుతోంది. అక్కడ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార బదిలీ కోసం అంతర్గత పోరు జరుగుతోంది. ఇది గమనించిన కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణలో ఇలాంటి సంక్షోభం రాకుండా ఉండాలని కోరుకుంటోంది. ఇలాంటి సమయంలో.. సీఎం మార్పు పార్టీని మరింత బలహీనపరుస్తుందనే భయంతో ప్రస్తుతానికి రేవంత్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీల అమలులో జాప్యంతోపాటు పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దశలో రేవంత్‌ను తొలగించడం వల్ల పార్టీకి ఎదురుదెబ్బ తగలవచ్చు. ఎందుకంటే పెరుగుతున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి అవసరమైన వాక్చాతుర్యంతోపాటు ప్రజాకర్షణ కలిగిన ప్రత్యామ్నాయ నాయకులు పార్టీలో లేరు. అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్‌లో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో.. బీజేపీ కూడా త్వరలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించి.. కాంగ్రెస్‌పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని తొలగిస్తే.. అది రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చు. పార్టీని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. దీంతో.. రేవంత్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో స్థిరత్వాన్ని కొనసాగించడంతోపాటు అంతర్గత పతనాన్ని నివారించడానికి ఇది కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. మరి దీనిపై కాంగ్రెస్ సీనియర్లు ఎలా స్పందిస్తారో చూడాలి...