జూన్ 8వతేదీన ఉదయం 10గంటల నుండి ప్రారంభం..
హైదరాబాద్: జూన్ 8 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. మృగశిర కార్తె జూన్ 8 ఆదివారం ఉదయం10 గం లకు ప్రవేశిస్తుందని...ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివరాలు తెలిపారు. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్, మరియు ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని... అందుకోసం ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. జి హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరకార్తె ప్రవేశించిన ఘడియల్లో తయారు చేసిన మందును చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు చాప మందు ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు పడకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని స్పష్టం చేశారు.