భారీ వర్షం.. ఓ తల్లికి మిగిల్చిన గర్భశోకం..
వర్షంలో కొడుకును కాపాడుకునేందుకు ముసలి తల్లి తీవ్ర ప్రయత్నం
ఆదుకోవాల్సిన జనం వీడియోస్ లు తీస్తూ కూర్చున్న వైనం
పలుమార్లు ఫోన్లు చేసిన స్పందించని అధికారులు.. ప్రజాప్రతినిధులు
కుత్బుల్లాపూర్ లో ప్రజా పాలన పడక వేసింది.
కొద్దిసేపటి పాటు కురిసిన వర్షం నీటిలో కొడుకు ప్రాణంను కాపాడేందుకు ఓ ముసలి తల్లి చేసిన ప్రయత్నం విఫలంగా మారింది. రెక్క ఆడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో రెండు గంటలసేపు కురిసిన వర్షం ఓ తల్లి కళ్ళముందే కొడుకు దూరం అయ్యాడు. కొడుకు ప్రాణం కోసం వర్షపు నీటిలో శ్రమించి కాపాడేందుకు నానా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం ఓ పేదింటి కుటుంబంలో విషాదం మిగిలించింది. Ghmc 130 సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద కృష్ణవేణి అనే మహిళ ఇంటిలోకి వర్షం నీరు చేరింది. అదే సమయంలో ఇంట్లో పడుకున్న ఆమె కుమారుడు పద్మారావు మద్యం మత్తులో ఉండిపోయాడు. ఇంటిలోకి వర్షం నీరు ఎక్కువ వస్తుడంటతో ఆమె కొడుకును కాపాడేందుకు చేత కాకపోయినా విఫలయత్నం చేసింది. నీటిలో నుండి కుమారుని ఇంటి నుంచి బయటకు లాక్కొని రావటం చూసిన ఇరుగు పొరుగువారు ఆమెకు తోడ్పాటునందించి , సహాయం చేయాల్సింది పోయి వీడియోలు తీస్తూ మానవత్వాన్ని మంటగలిపారు. అయినా కుమారుడు మీద ప్రేమ, కడుపు తీపితో కొడుకు పద్మారావును కాపాడేందుకు వర్షపు నీటిలో తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు పద్మారావు వర్షపు నీరు మింగాడో.. లేక ఇంకా ఏదైనా ఇబ్బంది జరిగిందో తెలియదు గాని మృతి చెందాడు. ఆమె చేసిన ప్రయత్నం స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మూగబోయిన ప్రజా ప్రతినిధులు,పాలకుల సెల్ ఫోన్లు....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షం కారణంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తలు, అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఒక ప్రకటన మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అయితే కుత్బుల్లాపూర్ లో మాత్రం సీఎం ఆదేశాలు బేఖాతార్ అయ్యాయి. కేవలం పోలీసు విభాగం తప్ప ఏ ఒక్క ప్రజా ప్రతినిధి, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ఉన్నత, శ్రేణులు, విద్యావంతులు ఏ ఒక్కరు కూడా ఘటన పై ఆరా తీయలేదని, పట్టించుకోలేదని స్థానిక ప్రజలు మండిపడ్డారు. పోలీసులు తప్ప ఏ అధికారి కూడా అక్కడికి వచ్చి తల్లిని రాత్రి వేళ పలకరించిన పాపాన పోలేదు. ప్రజా పాలనలో చిన్నపాటి వర్షం, ఓ కన్నతల్లి కొడుకు ప్రాణం కోసం చేసిన ప్రయత్నం వృధాగా మారింది. జనాలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్న నాయకులు ఈ నిరుపేద కుటుంబంపై జాలి చూపి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.