స్పేస్ లో చేపల పెంపకం..
అంతరిక్షంలో వ్యోమగాములకు ఆహార సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఫోకస్ చేశారు. మాంసాహార ఉత్పత్తులపై ప్రయోగాలు చేస్తున్నారు. లూనార్ హాచ్ ప్రాజెక్టులో భాగంగా రీసెర్చర్ డాక్టర్ సిరిల్లె ప్రిబ్జిలా నేతృత్వంలో అంతరిక్షంలో ఆక్వాకల్చర్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే వ్యోమగాములకు భూమిపై నుంచి ఆహారం పంపించే కష్టాలు తొలగిపోతాయి. పరిశోధనల్లో భాగంగా సీ బేస్ రకం చేపలను అంతరిక్షంలో పెంచాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం బరువు లేని తనం ఉండటంతోనే శాస్త్రవేత్తలు వీటిని ఎంచుకున్నారు.
అయితే రాకెట్ లాంచ్ సమయంలో ఉండే వైబ్రేషన్, హైపర్‌గ్రావిటీ, మైక్రోగ్రావిటీ, కాస్మిస్ రేడియేషన్ తదితర పరిస్థితుల్లో సీ బేస్ చేపల గుడ్లు మనుగడ సాగిస్తాయా, లేదా? అనే విషయంపై ప్రస్తుతం పరిశీలనలు చేస్తున్నారు. ఈ చేపల గుడ్లు ఇప్పటికే అనేక టెస్టుల్లో పాస్ అయినట్టు తెలుస్తున్నది. ఈ గుడ్లను అంతరిక్షంలోకి పంపించి, అక్కడ చేపలను పెంచి, వాటిని తొలుత భూమిపైకి పంపిస్తారు. వాటిపై అంతరిక్ష పరిస్థితుల ప్రభావం ఎంతమేరకు ఉందనే విషయమై నివేదికలు ఇస్తారు.