డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
డ్రగ్స్ కేసులలో దర్యాప్తు పకడ్బందీగా చేయడం ద్వారా నేరస్తులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ స్పష్టం చేశారు. డిజిపి కార్యాలయంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో విస్తృతస్థాయిలో డ్రగ్స్ పట్టుకున్న అధికారులకు రివార్డులు అందజేశారు. సమావేశంలో డిజిపి డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలనే దృఢ సంకల్పంతో ప్రత్యేక బ్యూరోని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రధమంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ను సీజ్ చేయడం, పద్ధతి ప్రకారం దర్యాప్తు చేసినట్లయితే నేరస్తులకు 10 నుండి 20 సంవత్సరాల శిక్ష పడుతుందన్నారు. తద్వారా మాదకద్రవ్యాల విషయంలో నేరస్తులు శిక్షలకు భయపడి మాదకద్రవ్యాల సరఫరా నియంత్రిస్తారని తద్వారా డ్రగ్స్ ను రాష్ట్రంలోకి రానివ్వకుండా అరికట్టాలని డిజిపి అన్నారు. రాష్ట్రంలోని కొందరు విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని తద్వారా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని డిజిపి అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు అధికారులు సమర్థంగా డ్రగ్స్ ను అరికట్టాల్సి ఉందన్నారు.
సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ.... పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేసేటప్పుడు న్యాయ , సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని నేరస్తులకు శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. నేరస్తులు దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ శిక్షల నుండి తప్పించుకునే అవకాశం ఇవ్వవద్దన్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రతిపాదికన ఈ కేసులను దర్యాప్తు చేయడం ద్వారా మాదకద్రవ్యాలను అరికట్టవచ్చు అన్నారు. అడిషనల్ డిజిపి అనిల్ కుమార్ మాట్లాడుతూ... మాదకద్రవ్యాల ను ఉపయోగించడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో యువత ఇప్పటికి సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. యువత విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ని ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాదకద్రవ్యాల వినియోగాన్ని అణిచివేయానే సంకల్పతో ఉన్నందున పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ... పోలీస్ సిబ్బంది సమాచారాన్ని సేకరించడం ద్వారా నేరస్తుల ఆచూకీ కనిపెట్టాలని సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు తమకు సమాచారం ఇవ్వడం ద్వారా సరఫరాను అడ్డుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగ సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయడం ద్వారా తమకు అందజేయాలని తద్వారా తాము పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. బ్యూరో ఎస్పి లు రూపేష్ , అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విస్తృతస్థాయిలో మదకద్రవ్యాలను పట్టుకున్న పోలీసు అధికారులకు రివార్డులు, ప్రశంస పత్రాలను డిజిపి అందజేశారు.