క్షమించాలి రేపు విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన హీరో మహేష్ బాబు
ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ కోసం మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు ఆ రెండు సంస్థలకు ప్రచార కర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న హైదరాబాద్ బషీర్ బాగ్ లో గల ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్ బుక్స్ తీసుకురావాలని సూచించింది. సాయి సూర్యకి సంబంధించి దాదాపు రూ. 100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. రూ. 74.5 లక్షల నగదు సీజ్ చేసింది. మహేశ్ బాబుకు చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో 2.5 కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించారు.