రోహింగ్యాలపై చర్యలు తీసుకోండి.. బీజేపీ డిమాండ్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోహింగ్యా అక్రమ వలసదారులు దేశ భద్రతకు సవాల్‌గా మారుతున్నారని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యాలు ప్రస్తుతం బోగస్ ఆధార్, ఓటర్ కార్డులు తయారు చేసుకొని భారత పౌరుల్లా స్థిరపడుతున్నారని, ఇది కేవలం అక్రమ వలస సమస్య కాదని, జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు.రోహింగ్యాలు స్థిరపడిన ప్రాంతాల్లో మతపరమైన శిబిరాలు, మదర్సాలను అడ్డుపెట్టుకొని శంకించదగిన కార్యకలాపాలు చేస్తున్నట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడం రామకృష్ణారెడ్డి, రామిడి వీర కర్ణ రెడ్డి నేతృత్వంలో బాలాపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సమస్య వెనక ఉన్న మాఫియా శృంఖలపై చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు తక్షణమే సర్వే నిర్వహించి, డాక్యుమెంట్లను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రజల భద్రత దృష్ట్యా నిర్లక్ష్యం అనర్హమని పేర్కొంటూ, అక్రమ వలసదారులను గుర్తించి, వెంటనే నిర్వాసనం చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు ఏనుగు రామ్ రెడ్డి, రేసు నరసింహ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంతడుపుల మహేందర్, బంగారు రాజ్ కుమార్, తిరుమలేష్, మల్లెల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.