జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ ఎమ్యెల్సీ ఎన్నికలు ప్రారంభం
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం బల్దియా ప్రధాన కార్యాలయంలోని భవన నిర్వహణ విభాగం గదిలో, 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్‌లో అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. ఈ రోజుకు బదులుగా జూన్ 14 రెండో శనివారం పని దినంగా పరిగణిస్తామని అధికారులు ప్రకటించారు. పోలింగ్‌లో మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటవుతుంది. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ పొందినవారు విజేతగా నిలుస్తారని చెప్పారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు.