దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
పార్వతీపురం మన్యం TPN : జిల్లాదోమల వ్యాప్తి నిర్మూలించడానికి డ్రైడే అందరికీ అనువైన, సులభమైన, ఉత్తమమైన పద్ధతని పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్ మోహనరావు సూచించారు. వెంకంపేట గ్రామంలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండటానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలు, పాడైన, నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, రుబ్బురోళ్లు, ప్లాస్టిక్ కప్పులలో నీటి నిల్వలు గుర్తించి పారబోయించారు. దోమల లార్వా పెరగడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను గ్రామంలో గుర్తించి వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్‌లో వైద్య సిబ్బంది మొబైల్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేశారు. పంచాయతీ సిబ్బందితో కలిసి తదుపరి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో జ్వరాలు ఏమైనా గుర్తించడం జరిగిందా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో జ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే దోమల వ్యాప్తిని అరికట్టాలని.. ఇందుకు అనేక పద్ధతులు ఉన్నాయని చెప్పారు.అయితే డ్రైడే నిర్వహణ ఆచరించడానికి ప్రతీ ఒక్కరికీ అనువైన, సులభమైన మార్గమని సూచించారు. అనంతరం గ్రామంలో ఎన్సీడి సర్వే తీరుపై ఆరా తీసి ఆన్‌లైన్ నమోదును పరిశీలించారు. దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తూ మందులు వాడుతున్న తీరును గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిడెమిక్ ఈవో సత్తిబాబు, వైస్ ఎంపీపీ జగన్నాథం, సూపర్‌వైజర్ జయగౌడ్, ఏఎన్ఎం జీఎం రత్నం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.