కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్ కాచిగూడ రైల్వే మ్యూజియంలో వరల్డ్ హెరిటేజ్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రైలు ప్రయాణికులు మరియు రైల్వే అభిమానులకు మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించారు. వరల్డ్ హెరిటేజ్ డే-2025 సాంస్కృతిక, ప్రకృతి వారసత్వాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. మ్యూజియంలో గతంలో వాడిన రైల్వే పరికరాల మోడల్స్, పనిచేసే లివర్‌లు, సిగ్నల్ వ్యవస్థలు మొదలైనవి ప్రదర్శించారు. 1960 నుంచి ఇప్పటివరకు ఉపయోగించిన ఫ్యాన్‌లు ప్రతి దశాబ్దానికి వేర్వేరుగా ప్రదర్శించడం సందర్శకుల్లో ఆసక్తిని కలిగించింది. 1916లో నిజాం ప్రారంభించిన కాచిగూడ స్టేషన్ ఫోటో వారసత్వాన్ని ప్రేమించే వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం 1916లో నిర్మించారు. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి ప్లాటినం అవార్డు కూడా పొందింది.
నైజాం కాలానికి చెందిన రైల్వే నెట్‌వర్క్‌కు సంబంధించిన పాత ఫోటోలు, ప్రదర్శనలు సందర్శకులకు మంచి అనుభూతిని కలిగిస్తోంది. మ్యూజియంలో స్వాతంత్య్రానికి ముందు కాలంలో ఉన్న వివిధ రైల్వే సంస్థల లోగోలు ప్రదర్శించారు. ఇతర ప్రదర్శనల్లో సిగ్నలింగ్ పరికరాలు, వివిధ లోకోమోటివ్‌లు, కోచ్‌ల నమూనాలు, టికెట్లు, వర్కింగ్ మోడల్స్ మొదలైనవి ఉన్నాయి. రైల్వే చరిత్ర, అభివృద్ధి, ఇతర అనుబంధ విషయాలపై రూపొందించిన చిన్న సినిమాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేశారు.