ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం కేసు క్లోజ్..!
హైదరాబాద్ TPN : హైదరాబాద్ లో MMTS ట్రైన్‌లో అత్యాచారయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల లోతైన విచారణలో ఈ ఘటనలో అత్యాచారయత్నమే జరగలేదని తేలింది. గత నెల 23న, ఓ యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న MMTS ట్రైన్‌లో మహిళల కోచ్‌లో ఒంటరిగా ఉండగా.. 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని.. తప్పించుకునేందుకు నడుస్తున్న ట్రైన్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలైనట్లు ఆరోపించింది. ఈ ఘటన కొంపల్లి సమీపంలో జరిగినట్లు తెలిపింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, 13 ప్రత్యేక బృందాలతో విచారణ ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు 28 కి.మీ. మార్గంలో 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. సుమారు 100 మంది అనుమానితులను విచారించారు. అయితే, యువతి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఐతే.. రైల్వే పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో.. యువతి తన ఆరోపణలు అబద్ధమని ఒప్పుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరిస్తుండగా ట్రైన్ నుంచి జారిపడినట్లు చెప్పింది. గాయాలను కప్పిపుచ్చేందుకు కుటుంబసభ్యులకు భయపడి అత్యాచార కథను అల్లినట్లు వెల్లడించింది. దీంతో రైల్వే పోలీసులు న్యాయ సలహా తీసుకుని కేసు మూసివేశారు.