రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్ TPN:
సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు. టీజీఏఎన్‌బీ అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేసి అనుమానస్పదంగా ఉన్న ఒడిశాకు చెందిన సమీర్ బిష్ణోయిని అదుపులోకి తీసుకొని అతడి నుంచి రూ.6.15 లక్షల విలువైన 12.3 కిలోల గంజయిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని దాదర్‌కు తరలిస్తున్నట్లు తేలిందని, ప్రధాన నిందితుడు మున్నా నాయక్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరో కేసులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేయగా.. జనరల్ కోచ్‌లో ఎరుపు రంగు బ్యాగ్ అనుమానాస్పద స్థితిలో కనిపించిందని హైదరాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బ్యాగ్‌కి సంబంధించిన వ్యక్తి కోసం వెతికితే ఎవరు కనిపించలేదు. మధ్యవర్తుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో ఓపెన్ చేసి చూడగా అందులో 12 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ సుమారు 6 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.