జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!

By Ravi
On
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!

సీఎం రేవంత్‌రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడుల పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సీఎం రేవంత్‌ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. 

జపాన్ కంపెనీలతోపాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనాలున్నాయి.  
మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై దృష్టిపెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతారు. చర్చల సందర్భంగా  సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనికి స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదేనని అన్నారు. దీంతో తెలంగాణలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని మారుబేనికి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని రేవంత్‌ భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబేని పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు. భారత దేశంతో జపాన్‌కు ఏళ్లకేళ్లుగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సీఎం మాటిచ్చారు. 

తెలంగాణతోపాటు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతకు మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  దై సకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. అక్కడున్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామన్నారు. మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ మరియు మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!