అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన పాలనలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా వలసల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత్ సహా పలుదేశాలకు చెందిన వందలాది మంది వలసదారులను ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు సాగనంపారు. ఈ క్రమంలో తాజాగా అక్రమ వలసదారులకు ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చారు. యూఎస్‌లో అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి విమాన ఖర్చులతో సహా కొంత డబ్బును కూడా అందిస్తామని అధికారికంగా ప్రకటించారు.
తాజాగా సాగిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు ఫోకస్ పెట్టారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలా వెళ్లాలనుకునే వారికి మా ప్రభుత్వం అన్నివిధాల సాయం చేస్తుంది. విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తుంది. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే మా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని చట్టపద్ధతిలో వెనక్కి తిరిగి రావడానికి కూడా అనుమతి ఇస్తామని ట్రంప్ తెలిపారు.