ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపకంపై విజిలెన్స్ డీజీ ఆరా
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్‌రాజ్, ట్రెజరర్ శ్రీనివాస్‌తో విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం ఉప్పల్‌లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియపై ఆరా తీశారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సెక్రటరీ, ట్రెజరర్‌లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి కాంప్లిమెంటరీ టికెట్ మొదటగా చేరుకునేది వీళ్లిద్దరు దగ్గరకే. కాబట్టి వీళ్లిద్దరి నుంచే టికెట్లు పక్కదారి పట్టినట్టు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇక స్టేడియంలో కార్ పాసులు, బైక్ పాసులు తమ సొంత మనుషులకే జారీ చేస్తున్నట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. కాంప్లిమెంటరీ టికెట్ల పంపిణీ విషయంలో సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాస్ కీలకపాత్ర వహిస్తున్నారు. ఒప్పందం ప్రకారం 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు హెచ్‌సీఏకి వస్తున్నా.. సన్‌రైజర్స్ టీమ్ యాజమాన్యం తక్కువగా ఇస్తున్నారంటూ బయట ప్రచారం చేసి.. తమ వర్గానికి టికెట్లను పంపిణీ చేస్తున్నట్టు గుర్తించారు. రాచకొండ పోలీసులు ఎక్కువ మొత్తంలో టికెట్లు తీసుకుంటున్నారంటూ సెక్రటరీ దేవ్‌రాజ్ బయట ప్రచారం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విజిలెన్స్ అధికారుల రంగంలోకి దిగి టికెట్ల పంపిణీపై వివరాలు సేకరించారు.