తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..!
జీహెచ్ఎమ్‌సీ టౌన్ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, సిటీ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎమ్‌సీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్, జోనల్ కమిషనర్‌లకు తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో తెలిపారు. ప్రెసిడెంట్ ఆండ్ ఫౌండర్ దళిత చేతన సంఘం పేరుతో ముప్పిడి నవీన్ అనే వ్యక్తి.. కొంత కాలంగా జీహెచ్ఎమ్‌సీ టౌన్ ప్లానింగ్‌లోని కింది స్థాయి దళిత వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. అంబర్‌పేట, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో సదరు వ్యక్తిపై అనేక పోలీసు కేసులున్నాయని, బిల్డింగ్ ఓనర్ల ఫిర్యాదుతో అనేక సార్లు అరెస్ట్ కూడ అయ్యాడని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ వ్యక్తి చేస్తున్న ఆరోపణలతో టౌన్ ఫ్లానింగ్ ఉద్యోగ సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. తమ ఆరోపణలపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ శ్రీధర్, తోటి నాయకులతో కలిసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.