కోటిపల్లి -ముక్తేశ్వరం వంతెనకు త్వరలో మోక్షం
- పట్టు వదలని విక్రమార్కులు
- మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ చొరవతో కలల వంతెన పనులు వేగవంతం
- రెండు నియోజకవర్గాల ప్రజలకు తీరనున్న కష్టాలు
రామచంద్రపురం : ఎన్నాళ్లుగానో వేచిన సమయం.. సుదీర్ఘకాలంగా కోనసీమ వాసుల కల నెరవేరే సుదినం.. త్వరలో రానుంది. కోటిపల్లి -ముక్తేశ్వరం మధ్య గౌతమీ గోదావరిపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ల చొరవకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సహకారం తోడవటంతో కోనసీమ ప్రజల కల సాకారం కానుంది. ఏళ్ల తరబడి నిరీక్షించిన రామచంద్రపురం, మండపేట నియోజవర్గాల ప్రజలు జిల్లా కేంద్రమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో రావులపాలెం మీదగా చుట్టూ తిరిగే వెళ్లాల్సిన పరిస్థితిఉంది. అలాగే కె. గంగవరం మండలం కోటిపల్లి, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కలుపుతూ గౌతమీ గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఫంటుపై ఆధారపడకుండా తక్కువ సమయంలో అమలాపురం చేరుకునే అవకాశం ఉంది. వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు గత ప్రభుత్వ హయాంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూ సహనం కోల్పోయి చతికిల పడ్డారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కోనసీమ ప్రజలు కష్టాలు తీర్చాలనే సదుద్దేశంతో ప్రణాళిక బద్ధంగా, ప్రాధాన్యత క్రమంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. మరో పక్క అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కూడా తనదైన శైలిలో పని చేస్తూ వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నారు. యువ నాయకులు, తమ ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని నిత్యం పరితపించే మంత్రి సుభాష్, అమలాపురం ఎంపీ హరీష్ లు కలుసుకున్న ప్రతి సందర్భంలోనూ ఈ వంతెన నిర్మాణంపై చర్చిస్తూనే ఉన్నారు. గౌతమీ గోదావరి నదిపై వంతెన సాధించాలనే పట్టుదలతో ఇటీవల ఢిల్లీలోని బి.జె.పి. నాయకులు రామ్ మాదవ్ కలుసుకుని వంతెన ఏర్పాటుకు నిధులు కేటాయించి, నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఒత్తిడి పెంచారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యను బిజెపి జాతీయ నాయకులకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను వివరించారు. న్యాయమైన కోరికకు భరోసా ఇస్తూ కేంద్రం వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఉత్సాహవంతుడు, అనతి కాలంలోనే ప్రజా సమస్యలపై పట్టు సాధించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా మంత్రి,ఎంపీల కృషి కు తన సహకారం జోడించడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయింది. వంతెనకు సంబంధించిన సమగ్ర నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, మరో ప్రైవేట్ కన్సల్టెన్సీ అధికారులు సమగ్ర నివేదిక (డి పి ఆర్)తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిసింది. వంతెన నిర్మాణానికి సుమారుగా రూ. 490 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. సుమారు ఆరున్నర కిలోమీటర్ల పొడవున్న వంతెన నిర్మాణానికి సంబంధించి ఒక్కో కిలోమీటర్ కు రూ.75 కోట్లు అంచనా వ్యయం కాగలదని అధికారులు అంచనా వేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం మంత్రి, ఎంపీల కృషితో మంజూరు చేయనుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రమాదకరమైన పంటు పై ప్రయాణించే బాధ తగ్గి, సుఖ ప్రయాణం కలుగుతుందని రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రక్క కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈవంతన నిర్మాణం పూర్తయితే మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పేర్లు కోనసీమ ప్రజల గుండెల్లో చిరకాలం పదిలంగా గుర్తుండిపోతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.