తప్పతాగి చర్చి గోడలపై రాశారు
TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 02/04/25
జిల్లాలో ఒకేసారి రెండు మతాలకు సంబంధించిన దేవాలయాలపై అన్యమత ప్రచారానికి సంబంధించిన రాతలు వెలుగుచూడటంతో జిల్లాలో సంచలనమైంది. ఈమధ్య కాలంలో గ్రామాల్లో అన్యమత ప్రచారాన్ని పలుచోట్ల అడ్డుకుంటున్న సందర్భంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. పోలీసుల అనుమతితో ప్రచారం చేస్తున్నామని చెబుతున్నా హిందూ దేవాలయాలకు దూరంగా క్రైస్తవ సభలు పెట్టుకోవాలని సూచించే పరిస్థితి ఏర్పడినది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో ఉన్న టౌన్హాల్ ఎదురుగా ఉన్న రోమన్ కేథలిక్ చర్చి, చిన్నబజారులో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చి గోడలపై జై శ్రీరామ్ అన్న రాతలను మంగళవారం రాత్రి గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో ఎండలమల్లికార్జునస్వామి ఆలయ గోడల మీద, కామేశ్వరిపేట ఆంజనేయ స్వామి ఆలయ గోడలపైన క్రీస్తు నినాదాలు కనిపించాయి. ఈ రెండూ ఒకేసారి వెలుగులోకి రావడంతో మతాల మధ్య చిచ్చు ఏర్పడింది.
పోలీసుల అదుపులో నిందితులు. శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అంతా భావించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఆలయాలు, ప్రార్ధన మందిరాల పైన అన్యమత ప్రచారం నినాదాలు రాసినవారిని పట్టిస్తే రూ.25వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇందులో జలుమూరు మండలంలో హిందూ దేవాలయ గోడలపైన క్రైస్తవ నినాదాలు రాసినవారు ఇంకా దొరకలేదు కానీ, నగరంలో ఆర్సీఎం చర్చి, తెలుగు బాప్టిస్ట్ చర్చి గోడలపై జై శ్రీరామ్ అని నినాదాలు రాసినవారు పోలీసుల అదుపులో ఉన్నారు. గునపాలెంకు చెందిన ఒకరు, మేదరవీధికి చెందిన మరో ఇద్దరు మద్యం సేవించి చర్చి గోడల మీద ఈ విధంగా రాసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.