HCUలో నుంచి ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదని, హెచ్సీయూలో నుంచి ఒక్క సెంటు భూమిని కూడా తీసుకోలేదు అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీలు విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నాయని, వారి వలలో పడవద్దని విద్యార్థులకు హితవు పలికారు.
20 ఏండ్లుగా న్యాయ వివాదంలో ఉన్న కంచ భూముల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, వాటిని కాపాడేందుకు అప్పుడు ఎందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు. ఆ భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాసేలా వ్యవహరించారని, అందుకే గతంలో నోరు మెదపలేదని చెప్పారు. పాత్రదారులు, సూత్రదారులు ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు. ఎంతో విలువైన కంచ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం న్యాయస్థానాల ముందు బలమైన వాదనలు వినిపించిందని, ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానికి దక్కాయని పేర్కొన్నారు. అప్పుడు ప్రయివేట్ కంపెనీకి 400 ఎకరాలు వెళ్తే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదని, ఆ భూములు ఇప్పుడు ప్రభుత్వం పరమైతే గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం,ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం, రాష్ట్ర ఆదాయం పెరిగేలా కంచ భూములను టీజీఐఐసీకి అప్పగించిందని, హైటెక్ సీటి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ తరహాలో ఆ ప్రాంతంలో సంస్థలను నెలకొల్పి రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తామని తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో రూ. 31 వేల కోట్ల విలువైన 453 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మిందని, అప్పుడు ఇల్లు గుళ్ల చేసి, ఇప్పుడు పెడబొబ్బలు పెడుతుందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వేల కోట్ల రూపాయాల విలువ చేసే భూములను బీఆర్ఎస్ పార్టీకి కేటాయించుకున్నారని, దేశంలో ఏ పార్టీకి రాని పార్టీ పండ్స్ బీఆర్ఎస్ కే ఎలా వచ్చాయని నిలదీశారు.
ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ కంపనీలకు ధారదత్తం చేసిందని, ఇప్పుడు అదే బీజేపీ నేతలు తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ద్వజమెత్తారు. దేశంలో గత పదేళల్లో 16 లక్షల ఎకరాల అడవిని నాశనం చేసిన అధికార బీజేపీకి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు
10 లక్షల మందితో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడుతామని చెప్పుతోందని, దాని నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌషిక్, నాగరాజు గౌడ్ పాల్గొన్నారు.