కిమ్స్ డాక్టర్ లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం...
హాస్పిటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన, మానవహారం...
రాజమండ్రిలోని కిమ్స్ (బొల్లినేని) హాస్పిటల్లో ఇంటర్నన్ షిప్పు చేస్తున్న ఒక ఫార్మసీ కాలేజీ విద్యార్థిని అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ దీపక్ అనే వ్యక్తి లైంగిక వేధింపులు భరించ లేక ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు బాధిత విద్యార్థిని చికిత్స పొందుతున్న హాస్పిటల్ వద్ద మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం షెల్టన్ హెుటల్ జంక్షన్లో బొల్లినేని హాస్పిటల్ యాజమాన్యంకు వ్యతిరేకంగా న్యాయం చేయాలని నినాదాలతో మానవహారం
నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాసన్నగూడెంకి చెందిన ఒక విద్యార్థిని వికాస్ ఫార్మసీ కాలేజీలో బి ఫార్మసీ చదువుతుంది. చివరి సంవత్సరం కావడంతో బొల్లినేని (కిమ్స్) హాస్పిటల్లో ఇంటర్న్ షిప్ చేస్తుంది. ఇదే హాస్పిటల్లో పిఆర్ఓగా ఉన్న డాక్టర్ దీపక్ ఈ అమ్మాయిని గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్టు, ఈ సంగతిని హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి సదరు విద్యార్థిని తీసుకువెళ్లింది. దీంతో డా. దీపక్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తావ్ అంటూ రెండుసార్లు ఆమెను కొట్టినట్లు తెలుస్తుంది. దాంతో ఆ బాధిత యువతి తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం రాత్రి నియో వెక్ 10 అనే ఇంజక్షన్ను ఎక్కించుకొని ఆసుపత్రిలోనే ఆత్మహత్యయత్నానికి దిగిందని, సూసైడ్ లెటర్ రాసినట్లు తోటి విద్యార్థులు చెప్తున్నారు. రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ తల్లిదండ్రులను గాని బంధువులు కానీ తోటి విద్యార్థులు కానీ యాజమాన్యం అనుమతించడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తమ అమ్మాయి మృతి చెంది ఉంటుందని, నిందితుడిని కాపాడేందుకు యాజమాన్యం వాస్తవాలను దాస్తుందనే అనుమానాలు తమకున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. సోమవారం రాత్రి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసును రాత్రి
ఒంటిగంట వరకు నమోదు చేయలేదని, తమ ప్రాంత ఎమ్మెల్యేతో ఫోన్ చేస్తేనే అప్పుడు నమోదు చేశారని తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని, నిందితుడు డాక్టర్ దీపక్ను అరెస్టు చేయాలని, నిర్లక్ష్యం వహించిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రకాశ్నగర్ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ బందోబస్తు నిర్వహించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం తాము బాధిత విద్యార్థిని పక్షాన ఉంటామని, ఆమెను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆమె తల్లి, సోదరిలను ఐసీయూలోకి తీసుకెళ్లి చూపించామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డా. దీపక్ విధుల నుండి తొలగించి పంపించేశామని చెబుతున్నారు.
కరోనా సమయంలోను దీపక్ పై ఆరోపణలు....
బొల్లినేని ( కిమ్స్)హాస్పిటల్లో పీఆర్వోగా విధి నిర్వహిస్తున్న డాక్టర్ దీపక్ కరోనా సమయంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి, వైకాపా ప్రభుత్వ హయాంలో తాను ధనుంజయ రెడ్డి బంధువునని చెబుతూ స్థానికంగా అనేక హాస్పిటల్లో దందాలు చేసినట్టు ఆరోపనలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సేకరించి విక్రయించేవాడని ఆరోపణలు ఉన్నాయి.