కవిత కొత్త పార్టీ.. గిదైతే ఫైనల్..
బిఆర్ఎస్ లో చీలికలకు దారితీసిన కవిత లేఖ
ప్రత్యేకపార్టీ పెట్టే ఆలోచనలో కవిత అంటూ ప్రచారం
రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని సమాచారం
కవితతో పలువురు సీనియర్ నేతలు భేటి అయినట్లు వినికిడి
జెండా.. అజెండా తో జనంలోకి వెళ్లే ప్రయత్నం
కవితను కూల్ చేసే పనిలో పడ్డ కుటుంబ సభ్యులు
అనుకున్నట్లే అయ్యింది. బిఆర్ఎస్ లో చీలిక మొదలైంది. ప్రత్యేక కుంపటి పెట్టేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక పార్టీ జెండా, ఎజెండాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిఆర్ఎస్ 2 పార్టీ పేరు డిసైడ్ కావడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్పీడ్ గా జరిగిపోయినట్లు సమాచారం. పార్టీలో ఎలాంటి నిర్ణయాలు ఉండాలి, ఏఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలి అనే విషయంపై ఉన్నత సమీక్షలు జరుగుతున్నాయట. అయితే ఈ పార్టీకి నేతృత్వం వహించేది బడే బాస్ గారాలపట్టి కవితే అని బయట పెద్ద టాక్ నడుస్తోంది.
పార్టీ పేరు "జన జాగృతి పార్టీ".. జేజేపి. అని తెలుస్తోంది. ఇటీవల కవిత కేసిఆర్ కి రాసిన లేఖ బహిర్గతం కావడం, విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత ఆమె మాట్లాడిన మాటలు అందరిని ఆలోచింప చేశాయి. కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి అని ఆమె చెప్పడం. లేఖలో తండ్రి చేసిన తప్పులను ఎత్తి చూపడం కవిత బిఆర్ఎస్ నుండి బయటకు రావాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పకనే చెబుతోంది. అంతే కాదు ఎయిర్ పోర్ట్ లో ఎక్కడ కూడా ఆమె బిఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ, గులాబీ రంగు కానీ కనిపించలేదు. జాగృతి బ్యానర్లు, కవిత టీమ్ అంటూ పోస్టర్లే కనిపించాయి. గతంలో టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బిఆర్ఎస్ గా రూపాంతరం చెందుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో ఆ పేరును మార్చడానికి కవిత ససేమిరా ఒప్పుకోలేదట. జాతీయస్థాయిలో కేసీఆర్ పార్టీని తీసుకు రావాలని చేసే ప్రయత్నాలు, తండ్రి మాట జవదాటలేక స్తబ్దుగా ఉన్నట్లు ఆమె సన్నిత వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ మౌనం, పార్టీ పగ్గాలు సోదరుడికి ఇచ్చేందుకు తండ్రి చేసే ప్రయత్నాలు ఆమెకు మింగుడు పడని వ్యవహారంలా మారి సొంత పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
అయితే ఈ విషయం ముందుగానే తెలిసిన కుటుంబ సభ్యులు అనేక మార్లు కవితకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినా వినడం లేదనే సమాధానం చెబుతున్నారు. జన జాగృతి పార్టీ ఏర్పాటు చేసి జనాల్లోకి వెళ్లి తన ఇమేజ్ పెంచుకోవడమే కాకుండా తెలంగాణ రాజకీయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం పాకులాడుతోందని బిఆర్ఎస్ కి చెందిన పలువురు సీనియర్ నేతలు అంటున్నారు. బీజేపీతో బిఆర్ఎస్ దోస్తానా లేక కవిత పార్టీ దోస్తానా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కవిత పార్టీ పెడితే బీజేపీతో పొత్తు ఖాయమని, అప్పుడే ఆమె లిక్కర్ స్కాం నుండి బయటపడే అవకాశాలు ఉంటాయని కొందరి ఆరోపణ. అయితే కవిత పార్టీ పెడితే బిఆర్ఎస్ లో బీభత్సంగా చీలికలు వుంటాయని పార్టీ రూపురేఖలు కూడా పోయే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటికే పార్టీలో ఏళ్ల తరబడి ఉంటూ 10ఏళ్ల ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేక నీరసపడిన నేతలు చాలా మంది ఆమెతో భేటి అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాపుకీ ధీటుగా పార్టీ జెండా గుర్తు, రంగులపై కసరత్తు చేసిందని వినికిడి.
ఇదిలావుంటే కవిత పార్టీ వెనుక ఓ మాజీ మంత్రి, బాస్ మేనల్లుడు ఉన్నడంటూ బయట విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గతంలో హరీష రావు బీజేపీలోకి వెళ్తున్నట్లు, ఆర్టీసీ సమ్మెలో కూడా హరీష్ రావు హస్తం ఉన్నట్లు పుకార్లు వచ్చాయని ఇది అంతే అంటూ హరీష రావు టీమ్ చెబుతున్నారు. ఇటీవలే హరీష్ రావు కూడా మా బాస్ కేసీఆరే అన్న విషయం మరిచిపోవద్దని అంటున్నారు. కేటీఆర్ కి తండ్రి పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని చూడటం, రాబోయే రోజుల్లో ఆయనే సీఎం అంటూ ప్రచారం జరగడం కుటుంబంలో చిచ్చు రగిల్చింది అనే మాట వినపడుతోంది. మరి కవిత జన జాగృతి పార్టీ నిజమేనా, దానిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు.. ప్రత్యేక కుంపటిని కూల్ చేస్తారా.. గొడవలు ఓ కొలిక్కి వస్తాయా.. లేదంటే బిఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్ గా మారుతుందా.. అనేది మరో ఎపిసోడ్ లో తెలిసేలా ఉంది.