అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం
వికారాబాద్ జిల్లా తాండూర్ భారీ వర్షానికి తడిసిపోయిన ధాన్యంఆరబెట్టిన వరి ధాన్యం వర్షార్పణం
కొనుగోలు కేంద్రాల్లో బిక్కుమన్న రైతులు
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షార్ఫణం అయ్యింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
తాండూరు మండలంలోని అంతారం, దస్తగిరిపేట్, చెంగోల్, గోనూర్, వీరారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయానికి తీసుకవచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టారు. అయితే బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికే కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం, బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం తడకుండా ఉండేందుకు రైతులు అవస్థలు పడ్డారు. అయినప్పటికి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రక్షణకు వసతులు, సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు వెలువెత్తాయి.