ముంబైని ఓడించిన కీలక ఓవర్లు..
క్రికెట్ మ్యాచ్ లక్ష్యం 156 పరుగులు. టీ20ల్లో పెద్ద కష్టమైన టార్గెట్ కాదు. కానీ, బౌలింగ్ కు సపోర్ట్ చేసే పిచ్ అంటే మాత్రం కష్టమే. అందుకు తగినట్టుగానే ముంబయి ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ ఎటాక్ ను మొదలుపెట్టారు. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం మలుపులు తిరిగి చివరికి గుజరాత్ టైటాన్స్ వైపే విజయం వచ్చి చేరింది. మొదట్లో అదరగొట్టిన ముంబయి ఆఖరికి ఓడిపోవడానికి కారణం మూడు ఓవర్లు మాత్రమే. దీంతో ముంబయి వరుస ఆరు విజయాలకు గుజరాత్ చెక్ పెట్టింది. ముంబయి బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 29/1. తర్వాత ఓవర్ లో దీపక్ చాహర్ 11 పరుగులు ఇచ్చాడు.
దీంతో గుజరాత్ ఏడు ఓవర్లకు 40/1తో ఉంది. అప్పటికే వర్షం పడుతుందేమోనని అనిపించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ 46/1 ఉండాలి. అంటే ఆరు పరుగులు వెనకబడి ఉంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య లాంగ్ ఓవర్ తో రెడీ అయ్యారు. ఫస్ట్ మూడు బంతులకు ఆరు పరుగులు ఇచ్చిన పాండ్య.. తర్వాత ఒక సిక్స్, రెండు నోబాల్స్, మూడు వైడ్లతో కలిపి ఆ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు సమర్పించాడు. ఇదే గుజరాత్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోసింది.