దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మండలంలో రెవెన్యూ అధికారులకు తాండ యువకులు షాక్ ఇచ్చారు. దుండిగల్ తాండ 2, సర్వే నంబర్: 684లో తెలంగాణ ప్రభుత్వం యువత కోసం కేటాయించిన క్రీడా ప్రాంగణం కబ్జాకు గురైంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ అధికారులు కబ్జాదారుల వైపు వత్తాసు పలుకుతుండడంతో తండా యువకులు ఏకమయ్యారు. తండాలో క్రీడా ప్రాంగణం స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు అక్రమ నిర్మాణ గదులను యువకులంతా కలిసికట్టుగా వచ్చి కూల్చి వేశారు. నెల నెల లక్షల రూపాయలు వేతనాలు అందుకుంటున్న మండల ఎమ్మార్వో, గిరిదావర్, సిబ్బంది అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని యువకులు మండిపడ్డారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికావడంతో తట్టుకోలేక తామే ఈ పని చేశామని యువకులు చెప్తున్నారు. తండా యువకుల చైతన్యం ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు స్థానికులు అభినందించారు. ఇప్పటికైనా దుండిగల్ మండలంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా తండా యువకులను ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు..