కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం
వికారాబాద్ జిల్లా తాండూర్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. స్వామి వారికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించగా, ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పట్నం మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు ముందుగా స్వామి వారిని దర్శించుకుని, రథానికి హారతి ఇచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ భద్రేశ్వర స్వామి రథోత్సవం దేవాలయ ప్రాంగణం నుంచి బసవన్న కట్టవరకు వైభవంగా నిర్వహించబడింది. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు తాండూరు నియోజకవర్గంతో పాటు కోడంగల్, పరిగి, వికారాబాద్, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.భద్రేశ్వర నామస్మరణతో తాండూరు పట్టణం మార్మోగింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూర్ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.