శిక్షలు నేరస్తులకు హెచ్చరిక గా పనిచేయాలి : కమలాసన్‌రెడ్డి
డ్రగ్స్, గంజాయి కేసుల్లో పడే శిక్షలు నేరస్తులకు హెచ్చరికగా పనిచేసి ఆయా నేరాలకు మళ్లీ పాల్పడకుండా నిరోధించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. గతంలో సంగారెడ్డిలో పని చేసిన ఎక్సైజ్ అధికారులు మంచి పనితీరును కనబరిచి కేసులు నమోదు చేయడంలోనే కాకుండా విచారణపరంగా కూడా సమర్థవంతంగా పనిచేసి శిక్షల ఖరారుకు తోడ్పడ్డారని అభినందించారు. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో పలు కేసుల్లో శిక్షలు పడేటట్లు చేసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మరియు సిబ్బందికి రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించటానికి ఎక్సైజ్ సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేసి శాఖకు గుర్తింపు తేవాలని తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా NDPS కేసుల నమోదులో మంచి ప్రతిభ కనబరిచారని.. అదేవిధంగా విచారణలో కూడా ప్రతిభ కనబరిచి శిక్షల పెంపునకు తోడ్పడాలని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో సంగారెడ్డిలో పనిచేసిన ఇన్స్‌స్పెక్టర్లు మధుబాబు, శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు అధికారుల్ని కూడా అభినందించి క్యాష్ రికార్డుల్ని అందించారు. ఈ కార్య క్రమంలో అడిషనల్ కమిషనర్ ఖురేషీ, ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ నంద్యాల అంజిరెడ్డి, ప్రదీప్ రావు, అడిషనల్ ఎస్పీ భాస్కర్ గౌడ్, డీఎస్పీలు తిరుపతి యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.