మల్లం సాంఘిక బహిష్కరణపై పవన్ స్పందించాలని డిమాండ్..!
కాకినాడ TPN : పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ నెల 16న విద్యుత్ పనుల్లో మరణించిన పల్లపు సురేష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు సీపీఐ, ఏఐటీయూసీ, దళిత హక్కుల సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమైఖ్య తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మల్లం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సురేష్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మల్లం గ్రామానికి చెందిన ఒక అగ్రకులం వారి ఇంట్లో పల్లపు సురేష్‌బాబు విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఇరువర్గాల పెద్దలు ఒప్పందం కుదుర్చుకుని మృతుడి కుటుంబానికి 2 లక్షల 75 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారని చెప్పారు.
ఐతే.. నష్టపరిహారం అడిగారని ధోరణిలో అగ్రకులాల పెద్దలందరూ దళిత కుటుంబాల్ని సాంఘిక బహిష్కరణ చేయాలని నిర్ణయించుకుని.. గ్రామంలో ఉన్న దళితులకు టిఫిన్లు అమ్మకూడదని, కిరణా వ్యాపారులు సరుకులు ఇవ్వకూడదని, చివరకు బయట నుంచి వచ్చే చేపల గంపల్ని కూడా వెనక్కి పంపడం జరిగిందని.. ఇది అమానవీయ ఘటనని మండిపడ్డారు. దీనిపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సాంఘిక బహిష్కరణ ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సును అమలు చేయాలని సూచించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ పథకాల అమలు జరిగి ఉండుంటే ఈరోజు పల్లపు సురేష్ 5 లక్షల ఆర్థిక సహాయం అందేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రన్న బీమా పథకం ద్వారా సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు మాట్లాడుతూ.. పల్లపు సురేష్‌బాబు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని.. ప్రభుత్వం దృష్టికి పల్లపు సురేష్ మృతి విషయాన్ని తీసుకెళతామని.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.