అవినీతిమయంగా ఏపీ మార్కెటింగ్‌శాఖ..!
- ప్రభుత్వ టమాటానే విక్రయించాలని రైతులపై ఒత్తిడి
- రోజురోజుకు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్న వైనం
- మార్కెటింగ్ అధికారుల ఒంటెద్దు పోకడ
- చేతులు మారుతున్న లక్షల రూపాయలు
- నెల నెలా అద్దె కట్టించుకుంటూ రైతులపై ఆంక్షలా..?
- మార్కెటింగ్‌శాఖలో అవినీతి తిమింగలాలు
- అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు
మధు, టీపీఎన్ కరస్పాండెంట్, అమరావతి : ఏపీ మార్కెటింగ్‌శాఖ అవినీతిలో అడ్డగోలుగా దూసుకెళుతోంది. మార్కెటింగ్‌శాఖ అధికారులు టమాటా కొనుగోలులో అడ్డగోలుగా అందినకాడికి దోచుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్ రోజురోజుకీ రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. నెలకు వేలాది రూపాయాల అద్దె చెల్లిస్తూ రైతు బజార్ స్టాల్‌లో వ్యాపారాలు చేస్తున్న డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వ టమాట మాత్రమే అమ్మాలని ఆంక్షలు విధిస్తూ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ టమాటానే నాణ్యమైనదని బీరాలు పలుకుతున్న అధికారులు.. తాము సొంతగా విక్రయిస్తే కేజీ టమాట కూడా విక్రయించలేమన్న భయంతో హోల్‌సేల్ టమాటా విక్రయాల్ని నిరోధించి.. కేవలం ప్రభుత్వ టమాటానే సర్కార్ నిర్ణయించిన ధరకే విక్రయించాలంటూ లేని ధరలను ప్రజల నెత్తిపై రుద్ది.. రైతు బజార్‌లో విక్రయాలు చేయించి.. ప్రజల సొమ్మును అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు.
ఇక రైతు బజార్లో స్టాల్స్ నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలు వారు తమకు ప్రభుత్వ టమాట వద్దని మొరపెట్టుకుంటున్నా.. వారిని మార్కెటింగ్‌శాఖ అధికారులు బ్లాక్‌మెయిల్ చేస్తూ.. ప్రభుత్వ టమాటానే విక్రయించాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ టమాట అధికారులు సమక్షంలోనే రేటుకు ఎంత వస్తే అంతే ఈవో కార్యాలయం దగ్గర కేజీ లెక్క విక్రయిస్తాం గానీ.. స్టాల్‌లో పెట్టి విక్రయించలేమని వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ టమాటా విక్రయంతో రోజుకు సుమారు రెండు వేల రూపాయల వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ టమాటానే వినియోగదారులకు విక్రయించవలసి వస్తే.. తాము చెల్లిస్తున్న నెలవారి అద్దెను రద్దు చేయాలని రైతులు, డ్వాక్రా సంఘాల వ్యాపారులు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు బజార్‌లోనూ, ఏ మార్కెటింగ్ శాఖలోనూ లేనివిధంగా.. ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారులు టమాటా కొనుగోలుని అడ్డుపెట్టుకొని రోజుకు లక్షల రూపాయలు ఆర్జించేస్తున్నారన్న విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కిలో 10 రూపాయలు మాత్రమే ఉన్న టమాటా ధరను మార్కెట్లో 14 రూపాయల వరకు ధర నిర్ణయించి విజయవాడ నగర ప్రజల నుంచి దోపీడికి పాల్పడుతున్నారు. కేజీకి నాలుగు రూపాయాలు ధరను అమాంతంగా పెంచేస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. అధికారులు, వెండర్లు కుమ్మక్కై ఒక్కో వాహనానికి రూ.50 వేలు చొప్పున మార్జిన్ పెట్టుకుని మరీ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విభాగంలో ఓ ఇద్దరు అధికారుల తీరు కారణంగానే ఇదంతా జరుగుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
మరోవైపు హోల్‌సేల్ టమాటాని ఆపి.. ప్రభుత్వ టమాటా పేరుమీద చేస్తున్న వ్యాపారం వెనుక ఉన్న గూడుపుఠాణి ఏమిటి అన్నది ఆయా అవినీతి, అక్రమాలకు పాల్పడే మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రమే తెలియాలి. ఇటీవల మార్కెటింగ్ శాఖలో ఉన్న అధికారుల అవినీతి దాహం ఎక్కువైందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈవో, ఏడీ, డీడీలే కాకుండా తమ పై అధికారులకు కూడా వాటాలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారి బాహాటంగా చెబుతున్నారంటే.. అవినీతి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు కూటమి ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా నాణ్యమైన కూరగాయాల్ని వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేస్తుంటే.. ఇదే శాఖలో కొంతమంది అవినీతి, అక్రమాలకు అలవాటు పడిన అధికారులు తీరు మాత్రం సర్కార్‌కు చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా ఉంది. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి మార్కెటింగ్ శాఖలో జరుగుతున్న అవినీతి భాగోతాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.