ఒక్క లేఖ విలువ అక్షరాలా రూ. 3,900 కోట్లు..!
- తమ క్రికెట్ ప్లేస్ కబ్జా చేశారంటూ హైడ్రాకి బాలుడి లేఖ
- జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ దగ్గర ప్రభుత్వ భూమి కబ్జా
- రూ.3,900 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన బాలుడి లేఖ
- లంగర్‌హౌజ్‌కి చెందిన బాలుడిని పొగడ్తలతో ముంచెత్తిన నెటిజన్లు
- సూపర్‌బాయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్
ఒక్క లేఖ.. కబ్జా రాయుళ్ల ఆలోచనల్ని తలకిందులు చేసింది. కోట్లకు కోట్లు వచ్చి పడతాయన్న ఆశ కాస్త నిరాశగా మారింది. రాత్రికి రాత్రి తయారు చేసుకున్న డాక్యుమెంట్లు చెత్త కాగితాలుగా మారాయి. తమ ఎత్తులకు పైఎత్తులు వేసిన వ్యక్తి ఎవరని ఆరా తీస్తే.. నకిలీ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ 12 ఏళ్ల బాలుడు ఇదంతా చేశాడని ఆలోచిస్తే మతిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ బాలుడు ఏకంగా రూ.3,900 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడి రికార్డులు బద్దలు కొట్టాడు. ఎస్ మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇదెక్కడో కాదు వీఐపీ జోన్‌గా మారిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగింది.
లంగర్‌హౌజ్‌కి చెందిన ఓ బాలుడు ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్న ఖాళీ జాగాలో చాలా రోజులుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు రాత్రి ఆ ల్యాండ్ చుట్టూ ఇనుప రేకులతో అడ్డుగా గోడ కట్టేశారు. ట్రెస్ పాస్ చేస్తే శిక్ష తప్పదు అంటూ బోర్డ్ పెట్టారు. రోజు మాదిరిగా క్రికెట్ ఆడటానికి వెళ్లిన ఆ బాలుడు అది చూసి తిన్నగా ఇంటికి వచ్చాడు. హైడ్రాకి తమ క్రికెట్ ప్లేస్ మూసేశారు అంటూ ఓ లెటర్ రాశాడు. మాకు క్రికెట్ ప్లేస్ ఇప్పించండి అంటూ లెటర్‌లో రిక్వెస్ట్ చేశాడు. ఈ లెటర్ చూసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ సిబ్బందిని అక్కడికి పంపారు. మొదట ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్ అని భావించారు. ఆ తరువాత రికార్డ్స్ తిరగేస్తే అసలు విషయం బయటపడింది.
39 ఎకరాల ల్యాండ్.. ఎకరం వంద కోట్లు.. అంటే అక్షరాలా రూ.3,900 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తేలింది. అంతే వెంటనే హైడ్రా టీమ్స్ రంగంలోకి దిగాయి. వెంటనే ఆ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. ఆ బాలుడు రాసిన లెటర్ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడేలా చేశాయి. ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. అయితే తాజాగా ఈ విషయం ఓ సమావేశంలో ఓ అధికారి నుంచి బయటపడింది. అప్పటి నుంచి హైడ్రాకి వచ్చే లేఖలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఊరూపేరు తెలియని ఆ బాలుడిని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.