ఎలక్ట్రానిక్ వ్యర్ధాలతో పిల్లలు, గర్భిణీలకు ప్రమాదం..!
విజయనగరం TPN : ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. ఈ వ్యర్ధాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని చెప్పారు. ఈ-వ్యర్థాలను శాస్త్రీయ విధానంలో తొలగించనట్లయితే వాటి నుంచి వెయ్యి రకాల ప్రమాదకర రసాయనాలు వెలువడతాయని.. వాటిని పీల్చిన గర్భిణీలకు, వారి గర్భంలోని శిశువుకు ఇవి ఎంతో హాని కలిగిస్తాయన్నారు. ప్రజల్లో ఈ-వ్యర్థాలపై అవగాహన తక్కువగా వుందని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విజయనగరం పాలకసంస్థ ఆధ్వర్యంలో ఈ-వ్యర్ధాలపై నగరంలో నిర్వహించిన ర్యాలీలో జోనల్ ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, మహిళలతో కలసి పాల్గొన్నారు. అనంతరం కోట దగ్గర విద్యార్థులు, మహిళలతో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల టన్నుల ఈ-వ్యర్ధాలు వున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ తన నివేదికలో వెల్లడించిందని.. ఇందులో ఇరవై మిలియన్ టన్నులు మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్టు పేర్కొందని తెలిపారు. మిగిలిన ఈ-వ్యర్థాలన్నీ అశాస్త్రీయ విధానంలోనే తొలగించడం జరుగుతోందని.. ఇది మానవాళి మనుగడకే ప్రమాదకరమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల్లో ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి ఓడల ద్వారా పంపిస్తున్నాయని.. ఇది ఎంతో ఆందోళనకరమన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యర్థాలను నగర పాలకసంస్థ ఏర్పాటు చేసిన ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రంలో అందజేస్తే.. వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు. ఈ-వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగిస్తే వాటి నుంచి ఎంతో విలువైన బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను వెలికితీయవచ్చన్నారు.