కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస..!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పేదలకు పింఛన్లు ఇవ్వకుండా ఏం చేశారనడంతో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అటు బీఆర్‌ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇరు పార్టీల నాయకులను సముదాయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీని మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం బాకీ ఉందన్నారు. రోడ్ల నిర్మాణం పేరుతో కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, అన్నోజీగూడ గ్రామాల్లో పేదల భూముల్ని లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.