అన్నివర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్..!
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే కాదు, అన్ని వర్గాలకు ఆశాజ్యోతని ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ టీ రాకేష్ కిరణ్ కొనియాడారు. నారాయణవనం బైపాస్ కూడలి దగ్గర ఉన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రియాశీలక కార్యదర్శి రాకేష్ కిరణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి వేడుకలను కొందరికే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఈ అంశంపై మాజీ సీఎం జగన్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా అంబేద్కర్ గురించి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక ఎంపీపీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం కోసమే అంబేద్కర్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు. అయితే దళితుల్లో ఇంకా కొందరు వారి బాధ్యతను విస్మరిస్తున్న నేపథ్యంలో.. ముందు మనం మారాల్సి ఉందన్నారు. వివిధ సమస్యలపై పరిష్కారానికి సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేస్తామన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ దివాకర్ రెడ్డి, రాకేష్ కిరణ్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి వేడుకల్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులతో కలిసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.