ఒరిస్సా పూరీ ఆలయంలో హఠాత్ పరిణామం..
ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు. కాగా ఈ ఆలయం శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోపురంపై ఉన్న జెండాను గద్ద తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవడం గమనార్హం. కాగా, పూరీకి వచ్చే భక్తులంతా మొదటగా ఈ జెండా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు. కాగా పూరీలోని ఈ జెండాకు సైతం విశిష్టత కలిగి ఉంది.