ఆయన.. ఎలక్షన్ టైమ్‌లోనే మాట్లాడతారు..! అప్పటిదాకా సైలెన్సే..!
- 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు
- ఆరుగురు సీఎంల కేబినెట్‌లో చోటు
- గత ఎన్నికల్లో ఓటమి పాలైన ధర్మాన
- ఓడిపోయాక జనంలోకి రాని ధర్మాన
- జిల్లాలో యాక్టివ్ కావాలని జగన్ ఒత్తిడి
- ఎన్నికల దాకా మౌనంగానే ఉంటానంటున్న ధర్మాన
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ధర్మాన ప్రసాదరావు ఎన్నో ఆటుపోట్లను అధిగమించారు. 15 ఏళ్ల పాటు మంత్రిగా సేవలు కూడా అందించారు. జగన్ క్యాబినెట్‌లో రెవిన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన.. 2024 సార్వత్రిక ఎన్నికట్లో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క కార్యక్రమానికి కూడా ప్రజల్లోకి వచ్చింది లేదు. సాధారణంగా అందరు రాజకీయ ప్రముఖులు ధర్మాన ప్రసాదరావు అలకపూనాడని అనుకుంటున్నారు. కానీ.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారు. అధికారం లేనప్పుడు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు మాత్రమే ప్రజల్లోకి వస్తారు. ఏ కార్యక్రమం జరిగిన అలానే జరుగుతుంది. కానీ.. ఆయన ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడడానికి పదవులు లేనప్పుడు బయటకు రారు.
ధర్మాన ప్రసాద్ రావు గారు పొలిటికల్ జర్నీని పరిశీలిస్తే.. ఆయన 1981లో మబకం సర్పంచ్‌గా.. 1982లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా..1987లో పోలాకి మండలం తొలి అధ్యక్షునిగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఇలా గ్రామ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్రస్థాయి రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1989లో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత వరుసగా 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపు బావుట ఎగురవేశారు. ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం సమన్వయకర్తగా అప్పట్లో చేశారు. కానీ ఇప్పుడు ఇవే పనులు చేయడానికి ఆయన ఆసక్తి చూపించట్లేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తన తర్వాత రాజకీయ వారసుడగా తన కుమారుని నిలబెట్టాలనే ఉద్దేశంతో.. ఆయన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైసీపీ తరఫున ఎలాంటి పదవులు స్వీకరించట్లేదని తెలుస్తోంది.
అందుకే ప్రజల్లో తిరగడానికి ఆసక్తి కనపరచట్లేదట. ఆయన కుమారుడు ధర్మాన రామ్మోహన్ శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు కుమారుడిని పంపిస్తున్నారుగానీ.. ఆయన మాత్రం వెళ్లడం లేదట. ప్రతి చిన్నదానికి తాను బయటకు వచ్చి మాట్లాడితే.. అది తన రాజకీయం అవుతుందే గానీ.. తన కుమారుడు రాజకీయం కాదు కదా అని కార్యకర్తల దగ్గర చెబుతున్నారట. ఓడిపోయిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన ప్రతి పార్టీ కార్యక్రమానికి ఆయన దూరంగానే ఉన్నారు.
ఇటు వైసీపీ అధినేత జగన్.. శ్రీకాకుళానికి సంబంధించి ఏదైనా ఒక పదవి ఆయనని చేపట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తన్నా సరే.. తాను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఎలక్షన్ టైమ్‌లో మాత్రమే వస్తానని చెబుతున్నారట. ఇప్పుడే శ్రీకాకుళంలో ఉన్న మిగతా సీనియర్లకు అవకాశం కల్పించండని.. ప్రస్తుతం తన నియోజకవర్గంలోని సమస్యలపై మాత్రమే తాను మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారట. మిగతా విషయాల గురించి తాను ఇప్పుడేం మాట్లాడలేనని.. తనకు ఏ పదవులు ఇవ్వద్దని.. పార్టీకి అనుకూలంగా తాను పనిచేస్తాను కానీ.. ఏ పదవుల్ని ఆశించడం లేదంటున్నారట. కాబట్టి ఈ పదవులు వేరే వారికి కట్టబెట్టాలని ఆయన చెప్పినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్న మాట.