సజ్జలను పెంచారా..? తగ్గించారా..? 

By Ravi
On
సజ్జలను పెంచారా..? తగ్గించారా..? 

  • జగన్‌ చుట్టూ కోటరీ కట్టిన సజ్జల
  • సజ్జలను కాదని నిర్ణయాలు తీసుకోలేని జగన్‌
  • వైసీపీ హయాంలో ప్రభుత్వంలో కీలకపాత్ర
  • తాజాగా వైసీపీ పీఏసీ చైర్మన్‌గా సజ్జల నియామకం
  • సజ్జల నియామకంపై సీనియర్ల అసంతృప్తి
  • వైసీపీ ఓటమికి సజ్జలే కారణమని క్యాడర్‌లో టాక్‌
  • ప్రస్తుతం స్టేట్‌ కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల
  • స్టేట్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలు సతీష్‌రెడ్డికి అప్పగిస్తారని ప్రచారం 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ఆయన్ని కాదని మంత్రులు కూడా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఆఖరికి జగన్‌ను కలవాలన్నా కూడా సజ్జల పర్మిషన్‌ ఉండాల్సిందే. సకలశాఖా మంత్రి అంటూ ఆయనపై ట్రోల్స్‌ కూడా వచ్చాయి. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం సజ్జలే అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్‌ చుట్టూ ఆయన ఓ కోటరీ కట్టారని.. అందుకే జగన్‌కు గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ వర్గాల మాట. ఐతే.. ఓటమి తర్వాత సజ్జలను జగన్‌ పక్కన పెడతారని చాలామంది భావించారు. కానీ.. జగన్ మాత్రం ఇంకా సజ్జల సృష్టించిన కోటరీని దాటి రాలేకపోతున్నారు. తాజాగా పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా సజ్జలనే నియమించారు. దీంతో జగన్‌ ఇక ఈ జన్మలో సజ్జలను వదలరని వైసీపీలో ఇన్‌సైడ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇంతకీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌గా ఉన్న సజ్జలను.. పీఏసీ చైర్మన్‌గా నియమించి జగన్‌ ఆయన స్థాయిని పెంచారా..? తగ్గించారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

నిజానికి వైసీపీలో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మొదటి నుంచి ఉంది. ఇది ఓ రకంగా పొలిట్ బ్యూరో లాంటిది. కానీ సమావేశాలు జరిగినట్లుగా పెద్దగా సమాచారం బయటకు రాదు. పార్టీ పదవులు ఇవ్వాలనుకున్న సీనియర్లను ఇందులో సభ్యులుగా నియమించేవారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డితోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకునే నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు నడిచిపోయేవి. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పీఏసీని ఏర్పాటు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 30 మందితో వైసీపీ పీఏసి కమిటీని ప్రకటించారు జగన్. అసలు ఈ పీఏసీ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క సజ్జలకు తప్ప. వైసీపీ ఘోర పరాభవానికి మూలకారకుడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డినే ఈ కమిటీ చైర్మన్‌గా నియమించారు జగన్.

అయితే కమిటీ సభ్యులుగా ఉన్న సీనియర్లకు.. చైర్మన్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించడం రుచించడం లేదు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవారు. ఆయనను తొలగించి సమన్వయకర్తగా పులివెందులకు చెందిన సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పీఏసీ కమిటీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం చూస్తుంటే.. సమన్వయ బాధ్యతలు సతీష్ రెడ్డికి అప్పగిస్తారని తెలుస్తోంది. జగన్‌ ఎక్కువగా బెంగళూరుకే పరిమితమవుతున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డినే మిగతా అన్ని విషయాలు చూసుకునేందుకు వీలుగా పీఏసీకి చైర్మన్‌గా నియమించినట్లు భావిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన సలహాదారుగా సజ్జల ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు. అయితే ఆయన తీరు వల్లనే పార్టీ ఓడిపోయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

ఇకపోతే.. కోటరీ పేరుతో జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయిరెడ్డి పార్టీ వీడటంతో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎదురు లేకుండా పోయింది. ఆయన చెప్పిందే వేదమని.. జగన్ కూడా ఆయనను కాదనలేని పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది.  విజయసాయిరెడ్డి ఉక్కపోత తట్టుకోలేక బయటకువచ్చారు.. ఇప్పుడు సజ్జలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇష్టం లేని మరికొంత మంది నేతలు కూడా బయటకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. జగన్‌ను నేరుగా కలవడానికి నేతలకు అవకాశం లేదు. సజ్జల ద్వారానే జరగాలి. ఆయన తమను జగన్ వద్దకు పోనివ్వడం లేదని చాలా మంది ఫీలవుతున్నారు. వీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరి సజ్జల ఎఫెక్ట్‌ వైసీపీలో ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Advertisement

Latest News