కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన
- సంక్షేమంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత
- చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
- ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆగిరిపల్లి/ఏలూరు : రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, నాపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచేపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరన్నారు. బడుగు బలహీనవర్గాల ఆరాధ్య దైవం ఆయన. 198 ఏళ్లయినా ఇంకా పూలే జయంతి జరుపుకుంటున్నామంటే అదే ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తిన్నారు. స్త్రీ విద్యకు ఆ రోజుల్లోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బాల్య వివాహాలు, సతీసహగమనాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. పూలే బాటలోనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రంలో మహిళా విద్యకు పెద్దపీట వేసి ఏకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు బీసీలకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ ఏ అన్నారు. అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఎలా అయితే రక్షణ కల్పిస్తున్నామో, త్వరలో బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, గత ప్రభుత్వ హయాంలో 24 శాతానికి తగ్గించారన్నారు. మేం మళ్లీ 34 శాతానికి రిజర్వేషన్ పెంచుతమన్నారు. నూజివీడు నియోజవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే వరకు మంత్రి పార్థసారధికి అండగా ఉంటానన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో కోర్టు వివాదాల్లో చిక్కుకుపోయిందన్నారు. ఆ వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా చూసి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.