పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "కార్యకర్తే అధినేత" కార్యక్రమం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బుధవారం నాడు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "కార్యకర్తే అధినేత - సమస్యలకు పరిష్కారం" అనే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సుమారు 100 పిర్యాదులను కార్యకర్తలు స్వీకరించారు. "ఇలాంటి గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టిన పార్టీ నాయకుడు నారా లోకేష్‌కు ధన్యవాదాలు" అని ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనువాస్, మంత్రివర్యులు నారా లోకేష్ వంటి నేతలు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి బుధవారం కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు సమావేశాలు నిర్వహించడం, అలాగే ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను అభినందించడం అనేది పౌరసేవకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని వర్మ అన్నారు.
ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా వైసీపీ పాలనలో అన్యాయంగా కేసులు పెట్టడం, అభివృద్ధి పనులను నిలిపివేయడం వంటి సంఘటనలు జరిగాయని గుర్తుచేశారు.
2014-2019 మధ్య కాలంలో గృహనిర్మాణ పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకపోవడం, 2019-2024 సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. 2024లో పార్టీ అధికారంలోకి రాగానే, ఈ సమస్యలు పరిష్కరించాలని, పూర్వపు దుర్గంధాలు తొలగించాలని వర్మ అన్నారు.
ఈ సందర్భంగా, తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు వారి సమస్యలను అర్జీ రూపంలో వ్యక్తం చేసి, వీటిని అధికారులకు వాట్సప్ లేదా ఈ మెయిల్ ద్వారా పంపించి పరిష్కారం కోసం కృషి చేశారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వర్మ మాట్లాడుతూ, "తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో కోటి సభ్యత్వంతో ఉన్న పార్టీ. ఏ ఇతర పార్టీకి ఈ స్థాయి సభ్యత్వం లేదు. ఈ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు" అని తెలిపారు.
వర్మ మరింతగా మాట్లాడుతూ, నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, మత్స్యకార సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్ర ద్వారా పార్టీ అధికారంలోకి వచ్చిందని వర్మ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పిటిసి సభ్యులు, కౌన్సిలర్లు, నీటి సంఘం చైర్మన్లు, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.