రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల సేద్యపు నీటి కుంటల నిర్మాణం
• కర్నూలు జిల్లా, పూడిచర్లలో శంకుస్థాపన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్ కు శంకుస్థాపన చేశారు. పూడిచర్లలో రైతు శ్రీ సూర రాజన్నకు చెందిన 1.30 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు కుంటకు భూమి పూజ చేశారు. ఉపాధి కూలీలతో కలసి స్వయంగా గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి భైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు శ్రీ గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.