నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!
వన్యప్రాణులపై అవగాహన కల్పించేందుకు వేసవి శిక్షణా కార్యక్రమం
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ వేసవి శిబిరం-2025ని ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 25 మంది విద్యార్థులతోపాటు కొంతమంది చిన్నవయసు శిబిరార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ కరేటర్ వసంత వేసవి శిబిరాన్ని ప్రారంభించి, శిబిరార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జూ అనేది కేవలం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మాత్రమే కాకుండా, ఎక్స్-సిటు సంరక్షణతోపాటు వన్యప్రాణి విద్యా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆమె చెప్పారు. ఈ వేసవి శిబిరం వన్యప్రాణులపై అవగాహన పెంపొందించేలా, విద్యను అందించేలా ఉంటుందని నెహ్రూ జూపార్క్ గర్వంగా ప్రకటించింది.
తర్వాత శిబిరార్థులను జూ పర్యటనకు తీసుకెళ్లి, జంతువుల నివాస స్థలాలు, ప్రవర్తన, జూలో నిర్వహించే వీటి సంరక్షణ ప్రణాళికలు, నైట్ హౌస్, డే క్రాల్ వంటి ప్రాంతాల గురించి జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దీపక్ తారుణ్‌తోపాటు ఆయన బృందం వివరించారు. అనంతరం యూకేలోని చార్లెస్ హోమ్స్ జూ డైరెక్టర్ మిస్సు మెలిస్సా వన్యప్రాణుల నిపుణులుగా శిబిరార్థులతో టైగర్ ఎన్‌క్లోజర్ దగ్గర మాట్లాడి, బయోడైవర్సిటీలో వన్యప్రాణుల పాత్ర గురించి వివరించారు.
చివరి సెషన్‌లో పాములపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో భాగంగా ప్రత్యక్ష ప్రదర్శన చేశారు. దీనిని చూసి శిబిరార్థులు ఎంతో ఉత్సాహంగా స్పందించారు. విద్యావేత్తలు విషపూరిత, విషరహిత పాముల మధ్య తేడా, అలాగే పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ వేసవి శిబిరంపై శిబిరార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం, సంతృప్తిని వ్యక్తం చేశారు. జూ నిర్వహణపై ప్రతి అంశం విపులంగా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ వేసవి శిబిరం చాలా శిక్షణాత్మకంగా ఉండి, తమలో వన్యప్రాణులపై అవగాహన పెంచిందని అభిప్రాయపడ్డారు. ఈ శిబిరాన్ని సజావుగా నిర్వహించిన జూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.