శ్రీకాకుళంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..!
శ్రీకాకుళం TPN : గొప్ప ప్రజాపాలనాదక్షుడు సీఎం నారా చంద్రబాబునాయుడు అని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కొనియాడారు. చంద్రబాబు 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో.. సమసమాజ మానవత్వపు భావనలతో.. వెనుకడుగు వేయని పోరాటపటిమతో, సాధించేవరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో.. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత, తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని చెప్పారు. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో కొనసాగుతూ.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, తనదైన ముద్ర వేశారన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయని చెప్పారు.