ఈ-సిగరెట్స్ అమ్మకాలపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉక్కుపాదం..!
హైదరాబాద్ TPN: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు హైదరాబాద్ నగర పోలీసులు విద్యాసంస్థల దగ్గర డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. కొన్ని విద్యాసంస్థల చుట్టుపక్కల ఈ-సిగరెట్‌ల విక్రయం జరుగుతోందని గమనించారు. అబిడ్స్ ప్రాంతంలో యువతకు ఈ-సిగరెట్‌లు, వేప్స్ విక్రయమవుతున్నాయని అనుమానం కలగడంతో.. యాంటీ నార్కోటిక్ బ్యూరో అబిడ్స్‌లో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్, సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, రోజరీ కాన్వెంట్ హైస్కూల్, సుజాత హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీల దగ్గర నిఘా పెట్టింది. ఈ నిఘాలో షక్తి సాయి కాంప్లెక్స్, హజ్ హౌస్ దగ్గర, నాంపల్లిలో నివసిస్తున్న సాదిక్ లలానీతోపాటు అతని సోదరుడు అనిల్ లలానీ అబిడ్స్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో నిషిద్ధమైన ఈ-సిగరెట్‌లు, వేప్స్ అమ్ముతున్నట్లు తేలింది. వీరు SID అనే పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను తయారుచేసి దాదాపు 500 మందికి పైగా సభ్యులను చేర్చి, దాంట్లో కొత్తగా వచ్చిన ఉత్పత్తుల్ని ప్రకటనల ద్వారా విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు ఆన్‌లైన్ చెల్లింపులు ద్వారా వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీమ్ ఈ-సిగరెట్‌లను వీరికి సరఫరా చేస్తున్నట్లు తేలింది. పెద్ద మొత్తాల ట్రాన్సాక్షన్‌ల కోసం మంగి రాంజీ గౌతమ్, సీఆర్ శర్మ అనే హవాలా ఆపరేటర్ల సేవలను వినియోగిస్తుండగా.. చిన్న మొత్తాల కోసం సాధారణ బ్యాంకింగ్ మార్గాలను వాడుతున్నారు. డెలివరీ కోసం రాపిడో, ఉబర్‌తోపాటు డీటీడీసీ సేవలను ఉపయోగిస్తున్నారు. ఈ కేసులో 13 మంది 18 ఏళ్లకు లోపల ఉన్న మైనర్ విద్యార్థుల వివరాలు లభ్యమయ్యాయి. వారిని డ్రగ్స్ వాడకానికి ఆకర్షించే ప్రమాదం ఉన్నందున, స్థానిక పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించనున్నట్ల యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు.
వాట్సాప్ గ్రూప్, ఉప్పీ, వాలెట్, భీమ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, రాపిడో, ఉబర్, డీటీడీసీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా 400 మందికి పైగా వినియోగదారులను గుర్తించారు. ఈ కేసులో బ్యాంక్ లావాదేవీల ఆధారంగా, ఈ విక్రయాల విలువ కనీసం రూ.1 కోటి వరకు జరిగిందని అంచనా. ఈ వ్యవహారంపై Cr.No.98/2025, U/s 7 r/w 4 PEC & 77 జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో డీటీడీసీ, ఉబర్‌తోపాటు రాపిడో సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే వారు సరైన స్క్రీనింగ్ లేకుండా చిన్నారులకు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చూపారని తెలిపారు. సాదిక్ లలానీ ఇంటి నుంచి 7 బ్రౌన్ కార్టన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అందులో వివిధ రకాల మరియు కంపెనీల నిషేధిత ఈ-సిగరెట్‌లు ఉన్నాయని చెప్పారు.